నేను కొందరికి నచ్చకపోవచ్చు
నా పని నేను చేసుకుపోతున్నా
కేబినెట్ విస్తరణ నా ఒక్కడి నిర్ణయమే కాదు
కులగణన ఒక బెంచ్ మార్క్
ఎస్సీ వర్గీకరణలో రాజకీయ జోక్యం లేదు
ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ చిట్ చాట్
తెలంగాణం, ఢిల్లీ(ఫిబ్రవరి 15): ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీడియాతో శనివారం నాటి చిట్ చాట్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను కొందరికి నచ్చకపోవచ్చని, తనను కొందరు అంగీకరించకపోవచ్చని, కానీ తన పని తాను చేస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తనను ప్రశ్నించే పరిస్థితి తెచ్చుకోనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ తరపున ప్రజలకు హామీ ఇచ్చింది తానని, అమలు చెయ్యక పోతే అడిగేది తననేనన్నారు. కొంతమంది తనపై అబద్ధపు ప్రచారాలు చేసి, పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. కేబినెట్ విస్తరణ తన ఒక్కడి నిర్ణయం కాదన్నారు. కులగణన అంశాలను రాహుల్ గాంధీకి వివరించినట్టు తెలిపారు. ఒక బహిరంగ సభకు పాల్గొననాలని రాహుల్ గాంధీని ఆహ్వానించినట్టు తెలిపారు. కులగణన అంశంలో వస్తున్న విమర్శల నేపథ్యంలో మార్చి ఒకటి వరకు అవకాశం ఇచ్చినట్లు చెప్పారు.
మంత్రివర్గ విస్తరణ అంశంపై చర్చ జరగలేదని, బడ్జెట్ సెషన్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు తెస్తామన్నారు. ఎస్సీ కులాల నుంచి వచ్చిన కొన్ని అభ్యంతరాలపై అధ్యయనానికి గడువు పెంచినట్లు తెలిపారు. ఎస్సీ ఉప కులాలకు సంబందించిన అభ్యంతరాలపై కమిషన్ అధ్యయనం చేస్తుందన్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణలో రాజకీయ జోక్యం లేదన్నారు. ఏక సభ్య కమిషన్ ఇచ్చిన నివేదికను యధాతథంగా అమలు చేస్తామన్నారు. కులగణన పై కమిటీ, కమిషన్ ఏర్పాటు, అది ఇచ్చే రిపోర్ట్ ను చట్టం చేస్తామని తెలిపారు. చిత్తశుద్ధితో కాంగ్రెస్ ఉందని, ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి చట్టం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, బీజేపీ సిద్ధంగా ఉందా? లేదా అని ప్రశ్నించారు. కులగణన ఒక బెంచ్ మార్క్ అని, ఇప్పటి వరకు కులగణన జరగలేదన్నారు.
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కోర్టు ఉత్తర్వుల ప్రకారం నడుచుకుంటామని, కోర్టులు చేసే పనిని కేటీఆర్ చేయాలనుకుంటున్నారని విమర్శించారు. ఉప ఎన్నికలు వస్తాయో రావో కేటీఆరే చెప్పేస్తున్నారన్నారు. రాజ్యాంగంలో ఉన్నదే కోర్టులు అనుసరిస్తాయి అన్నారు. గతంలో సబితా ఇంద్రారెడ్డి ఏ బీ ఫామ్ మీద గెలిచి, ఎవరి మంత్రి వర్గంలో పనిచేసిందని ప్రశ్నించారు. తలసాని శ్రీనివాస్ 2014 లో గెలిచింది ఏ బీ ఫామ్ మీద, మంత్రిగా పనిచేసింది ఎవరి ప్రభుత్వంలోనని ప్రశ్నించారు. ప్రధానిని కించపరిచేలా తాను మాట్లాడలేదని, వ్యక్తిగతంగా కానీ పదవి పరంగా గానీ తాను కించపరచలేదని, ఉన్నది చెప్పానన్నారు. అదే విషయాన్ని కిషన్ రెడ్డి, బండి సంజయ్ తేదీలు మార్చి ఖరారు చేశారన్నారు. రాహుల్ గాంధీతో తనకు విభేదాలు లేవని, చెప్పిన పనిని తు.చ. తప్పకుండా అమలు చేస్తున్నట్టు తెలిపారు. ప్రజల దగ్గరికి వెళ్ళింది తాను, హామీలు ఇచ్చింది తాను.. వాటినే అమలు చేస్తున్నట్టు తెలిపారు. ప్రతిపక్షాలు కావాలనే కులగణనపై రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. రాజకీయ కోణంలో కాదు ప్రజా సంక్షేమ కోణంలోనే కులగణన జరిగిందన్నారు. ప్రజలను ఉద్రేకపరిచే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ఎక్కడా లెక్క తప్పలేదని, అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటుకు బిల్లు తీసుకొస్తామన్నారు.