త్వరలో తెరపైకి మళ్లీ డ్రగ్స్ కేసు..!
మీడియాతో చిట్ చాట్ లో లీకు ఇచ్చిన సీఎం
మోడీతో భేటీ తర్వాత ఫుల్ జోష్ లో రేవంత్
జర్నలిస్టులు అడగని ముచ్చట్లు చెప్పిన వైనం
కేదార్ మృతితో కేటీఆర్‌కు లింకుంది ?
దాంట్లో ఓ మాజీ ఎమ్మెల్యే పాత్రుంది ?
కాళేశ్వరం ప్రాజెక్టు కేసు వాదిస్తున్న లాయర్,
కేసు వేసిన వ్యక్తులు చనిపోయారు ?
ఇవన్ని చూస్తుంటే మీకేమి అనిపిస్తలేదా అంటూ..
మీడియా అడగని ముచ్చట్లు చెప్పిన రేవంత్
ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ పై బీజేపీకి లీడ్ ఇచ్చిన సీఎం
BRS నిర్లక్ష్యం వల్లే SLBC కూలింది : సీఎం రేవంత్ (హైలైట్)
తెలంగాణం, పొలిటికల్ డెస్క్(ఫిబ్రవరి 26): త్వరలో మళ్లీ డ్రగ్స్ కేసును తెరపైకి తెచ్చేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రధాని మోడీతో భేటీ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి ఫుల్ జోష్‌లో కనిపించారు.
బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టేందుకు పూర్తి అప్రూవల్స్ పొందిన తర్వాతే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలోని తెలుగు మీడియాతో రేవంత్ రెడ్డి చిట్ చాట్ జరిపారు. ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన లీకులు సరికొత్త చర్చకు తెరలేపాయి. రిపోర్టర్లు ప్రశ్నలు అడగముందే రేవంత్ రెడ్డే అన్నీ చెప్పడం ప్రధానితో కుదిరిన ఒప్పందంలో భాగమేనని తెలుస్తోంది. వారిని అడిగి మరీ తాను లీకులు ఇవ్వడం పలు సందేహాలకు తావిస్తోంది. టాలీవుడ్ నిర్మాత కేదార్ మృతిని, డ్రగ్స్ కేసుతో ముడిపెట్టడం, అదే సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేరును ప్రస్తావించడం వెనక ఉన్న మతలబు కుట్రకోణంలో భాగమేనన్న చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో బీఆర్ఎస్ అధినాయకత్వంపై పెట్టిన ఏ కేసు నిలబడకపోవడంతో పాత కేసులను కొత్త కోణంలో తిరగదోడే ప్రయత్నంగా కనిపిస్తోంది.
తెలంగాణలో ఇటీవల మూడు అనుమానాస్పద మరణాలు చోటు చేసుకున్నాయని చిట్ చాట్ సందర్భంగా రేవంత్ రెడ్డి తెలిపారు. వీరిలో ఒకరు కాళేశ్వరం ప్రాజెక్టు పై (మేడిగడ్డ) కేసులు వేసిన రాజలింగమూర్తి, రెండవది సినీ నిర్మాత కేదార్, మూడవది వీరిద్దరి కేసులను వాదిస్తున్న సంజీవరెడ్డి అనే అడ్వకేట్ అని సీఎం అన్నారు. దుబాయిలో అనుమానాస్పదంగా మరణించిన సినీ నిర్మాత కేదార్, కేటీఆర్ బిజినెస్ పార్టనర్ అని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ మరణాలపై జ్యూడిషియల్ విచారణను కేటీఆర్ ఎందుకు కోరడం లేదని సీఎం ప్రశ్నించారు. దుబాయిలో కేదార్ మృతి చెందిన హోటల్లో బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే ఎందుకు ఉన్నారని కూడా సీఎం ప్రశ్నించారు. డ్రగ్స్ కేసులు త్వరలో విచారణకు వస్తున్న సమయంలో ఇలాంటి మరణాలు అనుమానాస్పదంగా ఉన్నాయని పేర్కొన్నారు. తన వ్యాపార భాగస్వామి మరణంపై కేటీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ మరణాలపై కేటీఆర్ కోరితే తాము విచారణ చేయిస్తామని కూడా సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేసారు. కేదార్ మరణంతో లింక్ ఉన్న డ్రగ్స్ కేసు బయటికి తీసి విచారణ జరిపిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. త్వరలోనే కేదార్ మృతదేహం ఇండియాకు రానుందన్నారు. ఇవన్నీ చూస్తుంటే ఏమీ అనిపిస్తలేదా అంటూ జర్నలిస్టులు ఉల్టా రేవంత్ రెడ్డి ప్రశ్నించడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ లీడ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ నేతల చుట్టూ ఉచ్చు బిగించేందుకు రెడీ అవుతున్నారన్న చర్చ జరుగుతోంది. కేంద్రం సాయాన్ని పూర్తిగా తీసుకుని ఓ భారీ వ్యూహాన్ని రచిస్తున్నారన్నది రాజకీయ పరిశీలకుల మాట.
SLBC పై రేవంత్ రెడ్డి స్పందించారు. బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్లే SLBC కూలిందని ఆరోపించారు. ఆ పాపం కేసీఆర్ దే అని అన్నారు. పదేళ్ల నుంచి ఎలాంటి పనులు చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. కాంగ్రెస్ హయాంలో 30 కిలోమీటర్లు టన్నెల్ పూర్తైందని, మధ్యలో ఏ పనులు చేయకపోవడం వల్లే మెషీన్ బేరింగ్స్ పాడయ్యాయని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్‌కు ఈ ప్రాజెక్టులో ఏం లాభం లేదనే పనులు పక్కకు పెట్టారని, మెషీన్స్ అన్నీ తుప్పు పట్టి పోయి ఉండటం వలనే ఈ ఘోరం జరిగిందన్నారు.