ఈ పాపం ఎవరిది..?


Published Feb 28, 2025 11:21:39 AM
postImages/2025-02-28/1740721899_WhatsAppImage20250228at10.59.20AM.jpeg

ఈ పాపం ఎవరిది?
కొట్టొచ్చినట్టు కనపడుతున్న నిర్లక్ష్యం
SLBCలో ప్రమాదం పొంచి ఉన్నా పనులు ప్రారంభం
బలవంతంగా టన్నెల్‌లోకి కార్మికులు
నైట్ షిఫ్టులోనే ఊడిపడ్డ రాళ్లు, మట్టి
అధికారులను హెచ్చరించిన కార్మికులు 
అయినా ఉదయం షిఫ్టు పనులు
ప్రమాదంలో పడ్డ 8 మంది ప్రాణాలు 
కార్మికులకు భరోసా ఇవ్వని కాంట్రాక్టర్
జీతాలు కూడా ఇవ్వని వైనం
 
హైలెట్‌బాక్స్: SLBC టన్నెల్ ప్రమాదంలో ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. ఎటువంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా, కార్మికుల హెచ్చరికలను పట్టించుకోకుండా పనులు చేపట్టారు. 8 మంది ప్రాణాలను అపాయంలోకి రేవంత్ సర్కార్ నెట్టేసింది. ప్రపంచంలోనే అత్యంత క్లిష్టమైన నిర్మాణాన్ని చేపడుతున్నప్పుడు కనీస జాగ్రత్తలు తీసుకోవాలన్న ఆలోచన లేకుండా ఆదరాబాదరాగా పనులు ప్రారంభించారన్న చర్చ జరుగుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిర్మాణరంగ నిపుణులు, పరిశీలకు తీవ్ర స్థాయిలో తప్పుబడుతున్నారు. ప్రమాదం జరిగి ఆరు రోజులైనా సహాయకచర్యల్లో పూర్తిగా విఫలమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

తెలంగాణం, స్టేట్‌బ్యూరో(ఫిబ్రవరి 27): SLBC టన్నెల్ నిర్మాణం అత్యంత క్లిష్టమైనది. సొరంగంలో బురద, ఊట కారణంగా ఏర్పడిన అవాంతరాలతో మూడు, నాలుగేళ్లుగా పనులు ముందుకు సాగని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మళ్లీ పనులు ప్రారంభించినప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలను రేవంత్ సర్కార్ విస్మరించిందన్న చర్చ జరుగుతోంది. కార్మికులను కూడా బలవంతంగా లోనికి పంపారని, ఈ నిర్లక్ష్యమే భారీ మూల్యం చెల్లించుకునేలా చేసిందన్నారు. ఆరు రోజులుగా నిరంతరాయంగా 10 రెస్క్యూ టీమ్స్ కష్టపడుతున్నా.. 8 మంది జాడను కనిపెట్టలేకపోతున్నారని, ఇంకా మూడు, నాలుగు రోజులు అంటూ ప్రభుత్వం కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సర్కార్, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం గురించి క్షేత్రస్థాయిలో పని చేసిన కార్మికులే దుయ్యబడుతున్నారు. 

బలవంతంగా పంపించారు!

బలవంతంగా లోపలికి పంపించారని స్వయంగా కార్మికులు చెబుతున్నారు. ఓ కార్మికుడు మీడియాతో మాట్లాడుతూ.. అధికారుల నిర్లక్ష్యాన్ని, ప్రభుత్వ తీరును ఎండగట్టాడు. నైట్ డ్యూటీలో ఉండగానే రాళ్లు, మట్టి కూలిందని, ఉదయం షిఫ్టులో వచ్చిన వారికి విషయం చెప్పి హెచ్చరించామని తెలిపాడు. కానీ అధికారులు బలవంతంగా లోపలికి తీసుకెళ్ళారని వాపోయాడు. అయితే తాము బయటకి వచ్చిన కాసేపటికే కూలిపోయిందన్నారు. 42 మంది ప్రాణాలతో బయటపడ్డా.. ఇంకా 8 మంది అందులోనే చిక్కుకోవడం తీవ్రంగా బాధిస్తోందన్నాడు. ఇప్పటికీ వారి ఆచూకీ కనుక్కోలేకపోయారని రేవంత్ సర్కార్‌పై మండిపడ్డాడు. 

జేపీ గ్రూప్ అధినేతపై విమర్శల వెల్లువ

కాంట్రాక్టర్ తీరుపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. SLBC ప్రమాదంపై టన్నెల్ కాంట్రాక్టర్ జేపీ గ్రూప్ అధినేత జై ప్రకాశ్ గౌర్ స్పందించిన తీరు విమర్శల పాలైంది. ప్రమాదాలు మామూలే, మృతదేహాలు తొలగించి పనులు చేపట్టాలన్న ఆయన.. తన జీవితంలో టెహ్రీ, భూటాన్, జమ్ము-కాశ్మీర్ వంటి ఆరేడు సంఘటనలను చూశానని చెప్పడంపై పలువురు మండిపడుతున్నారు. ఈరకంగానే కార్మికుల భద్రతపై జాగ్రత్తలు తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  మరోవైపు తమకు జీతాలు ఇవ్వడం లేదని కార్మికులు వాపోతున్నారు. 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని యాజమాన్యంపై మండిపడుతున్నారు. కనీసం ఒక నెల జీతమైనా ఇస్తే ఇంటికి వెళ్ళిపోతామని కార్మికులు అంటున్నారు.

newsline-whatsapp-channel
Tags : revanth-reddy congress salary government

Related Articles