Balka Suman: బాల్క సుమన్‌కు నోటీసులు జారీ చేసిన పోలీసులు

మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌కు పోలీసులు నోటీసులు అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే

Balka Suman: బాల్క సుమన్‌కు నోటీసులు జారీ చేసిన పోలీసులు
X

Balka Suman: మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌కు పోలీసులు నోటీసులు అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Cm revanth reddy)పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణల నేపథ్యంలో మంచిర్యాల పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే మంచిర్యాల జిల్లా బీఆర్‌ఎస్‌(BRS) కార్యకర్తల సమావేశంలో బాల్క సుమన్‌, సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసినట్టు కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసారు. మంచిర్యాల పోలీస్‌స్టేషన్‌(police station)లో బాల్క సుమన్‌పై ఐపీసీ 504, 294(బి) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మాజీ సీఎం కేసీఆర్ పై ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం సరికాదని బాల్క సుమన్‌ హెచ్చరించారు. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డిని చెప్పుతో కొడతానంటూ ఆగ్రహంతో వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డీ ఖబడ్దార్ అంటూ సవాల్ విసిరారు. తమ ప్రభుత్వం లేకపోయినా సరే.. కేసీఆర్ జోలికి వస్తే తొక్కి పడేస్తాం అంటూ హెచ్చరించారు. అయితే ఆ వెంటనే సంస్కారం అడ్డువస్తోందంటూ సర్దిచెప్పుకునే యత్నం చేశారు.

ఆ ప్రసంగం వీడియో వైరల్‌ కావడంతో కాంగ్రెస్‌ నేతలు పోలీసులను ఆశ్రయించారు. తాజాగా ఈ కేసులో మంచిర్యాలలో ఆయనను కలిసి పోలీసులు నోటీసులను అందజేశారు. విచారణకు హాజరు కావాలంటూ ఆదేశించారు. ఈ విషయాన్ని బాల్క సుమన్ వెల్లడించారు. ప్రభుత్వం అక్రమంగా తన మీద కేసులను నమోదు చేసిందని ఆరోపించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎన్నో కేసులను ఎదుర్కొన్నామని, మరోసారి ఉద్యమ బాట పట్టబోతోన్నామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే దాకా పోరాటం చేస్తామని చెప్పారు.

Next Story
Share it