చీకటి పడితే గుప్పుమంటున్న లక్కపురుగులు!

గత 10 ఏళ్ల క్రితం గ్రామ శివారులో నిర్మించిన ప్రైవేట్ బియ్యం గోదాముల ఏర్పాటుతో గ్రామస్తులు లక్కపురుగులతో సాహసం చేయాల్సి వస్తుంది.

చీకటి పడితే గుప్పుమంటున్న లక్కపురుగులు!
X

TS: వరంగల్ జిల్లా ఖానాపురం మండల కేంద్రంలో జాతీయ రహదారిపై ఉన్న ప్రైవేట్ ఎఫ్.సి.ఐ గోదాంలో యాజమాన్యం సరైన నిర్వహణ చేయడంలేదని స్థానికులు వాపోతున్నారు. గత 10 ఏళ్ల క్రితం గ్రామ శివారులో నిర్మించిన ప్రైవేట్ బియ్యం గోదాముల ఏర్పాటుతో గ్రామస్తులు లక్కపురుగులతో సాహసం చేయాల్సి వస్తుంది. చీకటి పడితే లక్కపురుగులతో గ్రామస్థులు అవస్తలు పడుతున్నారు. ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకోవడంతో ప్రైవేట్ ఎఫ్.సి.ఐ గోదాం వారికి మందలించగా.. దున్నపోతు మీద వానపడ్డట్లు లక్కపురుగులు రాకుండా మందు పిచికారీ చేసి తూతుమంత్రంగా చేతులు దులుపుకుంటున్నారని అంటున్నారు. శాశ్వత పరిష్కారం కోసం మార్గం చేయకపోవడంతో గ్రామస్థులు ఆగ్రహంతో ఇటీవల గోదాంను ముట్టడించి ప్రధాన గేటుకు తాళం వేసి సంస్థ కార్యకలాపాలు నడవకుండా చేసారు.

దీంతో యాజమాన్యం లక్కపురుగులు రాకుండా చర్యలు తీసుకుంటామని గట్టి హామీ ఇవ్వడంతో గ్రామస్థులు తాళాలు ఇచ్చారు. వెంటనే ప్రతిరోజు లక్కపురుగుల నివారణ కోసం ప్రతిరోజు మందులు పిచికారీ చేయడంతో నెల రోజుల పాటు పురుగులు రాలేదు. గ్రామస్థులు ఊపిరి పీల్చుకుని హాయిగా నిద్రపోయారు. ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలువలేదు. ఇప్పుడు యాజమాన్య సరైన నిర్వహణ లేకపోవడంతో ఎక్కడి వేసిన గొంగటి అక్కడే అన్నట్టు లక్కపురుగులు విపరీతంగా వ్యాపించడంతో తినే అన్నంలో కుప్పలుకుప్పలుగా లక్కపురుగులు కనిపించడంతో పొద్దస్తం పనిచేసి ఖాళీ కడుపుతో పస్తులతో సాహసం చేస్తున్న సంఘటనలు ఖానాపురంలో మళ్ళీ చోటుచేసుకుంటున్నాయి.

మరోవైపు సంవత్సరంలోపు చిన్న పిల్లలకు లక్కపురుగులు కరవడం, పారడంతో దద్దుర్లు, చర్మం పొడిపారడం వంటి వింత జబ్బులతో బాధపడుతున్నారు. పిల్లల తల్లిదండ్రులు సంపాదించిన కాస్త డబ్బులు ఆసుపత్రుల పాలు చేసుకుంటున్న పరిస్థితులు కనపడుతున్నాయి. గోదాం నుండి లక్కపురుగులతో మండల కేంద్రంలో నివాసం ఉంటున్న సుమారు పదివేల జనాభా ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న అధికారులు చర్యలు తీసుకోకపోవడం ఒకింత ఆశ్చర్యానికి గురికాక తప్పడంలేదు. కావున జిల్లా కలెక్టర్ ఒక్కసారి గ్రామంలో పర్యటించి లక్కపురుగుల కోసం సరైన నివారణ చర్యలు తీసుకొని గోదాం యాజమాన్యంపై చర్యలు తీసుకుని, గోదాం మూసివేతకు అనుమతులు ఇవ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Tags:
Next Story
Share it