TSRTC: మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్‌ స్వాధీనం

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి మల్టీప్లెక్స్‌ను ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

TSRTC: మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాల్‌ స్వాధీనం
X

న్యూస్ లైన్ డెస్క్: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి మల్టీప్లెక్స్‌ను ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం బకాయిలను చెల్లించనందున విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ తో చేసుకున్న అద్దె ఒప్పందాన్ని ఆర్టీసీ యాజమాన్యం రద్దు చేసింది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు బస్ స్టేషన్ సమీపంలోని ఆర్టీసీ స్థలంలో ఉన్న జీవన్ రెడ్డి మాల్ అండ్ మల్టీప్లెక్స్ భవనాన్ని గురువారం సాయంత్రం ఆర్టీసీ సంస్థ స్వాధీనం చేసుకుంది. గతంలో ఆర్టీసీకి చెందిన భూమిని 33 సంవత్సరాలకు విష్ణుజిత్‌ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ కంపెనీ బిల్ట్‌ ఆపరేట్‌ ట్రాన్స్‌ఫర్‌ లీజ్‌కు తీసుకుంది. 2017లో విష్ణుజిత్ ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీని మాజీ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి సతీమణి రజితా రెడ్డి టేక్‌ఓవర్‌ చేసుకుని షాపింగ్‌ మాల్‌కు జీవన్‌ రెడ్డి మాల్‌ అండ్‌ మల్టీపెక్స్‌‌గా పేరుపెట్టారు. కాగా, థర్డ్‌ పార్టీలకు అందులోని స్టాళ్లను లీజ్‌కు ఇచ్చారు. అయితే ఒప్పందం ప్రకారం ఆ కంపెనీ సకాలంలో అద్దె చెల్లించలేదు. గత ఏడాది అక్టోబర్‌ వరకు రూ.8.65 కోట్ల బకాయి సంస్థకు పడిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. కోర్టు నోటీసులు జారీ చేయడంతో అక్టోబర్‌‌లో రూ.1.50 కోట్లను ఆ కంపెనీ చెల్లించింది. ఆ తర్వాత షోకాజ్‌ నోటీసులు పంపించడంతో గత ఏడాది డిసెంబర్‌‌లో విడతల వారీగా రూ.2.40 కోట్లను కట్టింది. షోకాజ్‌ నోటీసును సవాల్‌ చేస్తూ హైకోర్టును వారు ఆశ్రయించారు. టీఎస్‌ఆర్టీసీకి బకాయిలు చెల్లించాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో విడతల వారీగా రెండు కోట్లను చెల్లించారు. ఈ కేసుపై బకాయిలన్నీ నెల రోజుల్లో చెల్లించాలని మార్చి 27న హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. బకాయిలు చెల్లించకుంటే నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని సంస్థను ఆదేశించింది. నెల రోజుల గడువు పూర్తయిన మొత్తం బకాయిను కంపెనీ చెల్లించలేదు. ఇప్పటివరకు రూ.2.51 కోట్ల అద్దె బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయిని తెలిపారు. గత 5 సంవత్సరాలుగా 20కి పైగా నోటీసులను సంస్థ జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులు, అద్దె ఒప్పంద నిబంధనల ప్రకారం విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు టర్మినేషన్ ఆర్డర్ ఇచ్చి భవనాన్ని టీఎస్ఆర్టీసీ స్వాధీనం చేసుకుందని సజ్జనార్‌ పేర్కొన్నారు.

Tags:
Next Story
Share it